secret behind ganesh immersion in telugu language

What is the secret behind ganesh immersion in ganga..?

What-is-the-secret-behind-ganesh-immersion-in-ganga-bakthi.co.in

వినాయక విగ్రహం గంగలో కలపడం వెనుక అంతరార్ధం ఏంటి?


వినాయక చవితి అంటే ముఖ్యంగా మూడు కార్యక్రమాలు తప్పనిసరి. విగ్రహం తేవడం. మండపాల్లో పెట్టి నవరాత్రుల పాటూ పూజించడం. ఆఖరుగా నిమజ్జనం చేయడం. దీని అర్ధమేంటి? వినాయకుడ్ని మాత్రమే ఎందుకిలా నిమజ్జనం చేస్తారు? అందులో దాగిన సామాజిక- ఆయుర్వేద- ఆధ్యాత్మిక- విశేషాలేమిటి? అన్నిటికన్నా మించి నిమజ్జన రహస్యాలేమిటి?
నిమజ్జనం వచ్చిందంటే చాలు గణపతిబప్పా మోరియా నినాదాలు మిన్నంటుతాయి. వూరూరా- వాడవాడలా వినాయక విగ్రహాలు వూరేగుతూ ఏ చెరువులు గుంటల్లోనూ నిమజ్జనమవుతాయి. అత్యంత పవిత్రంగా విగ్రహాలు పెట్టి.. పూజాధికాలు నిర్వహించి.. గంగలో కలపడం వెనుక అంతరార్ధం ఏంటి?
వినాయక విగ్రహం సృష్టించి- దాన్ని పూజించి- ఆఖరున నిమజ్జనం చేయడం అంటే.. సృష్టి- స్థితి- లయలకు నిదర్శనమా? లేక వినాయక నిమజ్జనంలో మరేదైనా పరమార్ధం దాగి వుందా? అని ప్రశ్నించుకుంటే గణపతి వృత్తాంతంలోని అనేక విషయాల గురించి తెలుసుకోవాలి. గణపతి పుట్టుక- పూజ- నుంచి నిమజ్జనం వరకూ ప్రతిదాన్లో సామాజిక, ఆయుర్వేద, ఇతర పర్యావరణ కోణాలు అకళింపు చేసుకోవాలి. అసలు భారతీయులు వినాయక చవితి ఇంతలా జరుపుకోడానికి కారణం తెల్లదొరలకు వ్యతిరేకంగా చర్చలు జరపడానికి. అలా స్వాతంత్ర సమరంలో పాల్గొంటున్న వారందరూ ఒక చోట చేరడానికి వేదికగా మారింది వినాయక చవితి వేడుక. బాలగంగాధర్ తిలక్ వంటి నేతలు ఈ దృష్టితోనే వినాయక చవితిని భారీ ఎత్తున చేయడం ప్రారంభించారు.
వినాయకుడు పార్వతీపరమేశ్వరుల పుత్రుడని చెబుతాయి పురాణాలు. ఆయన పుట్టిందే పిండిబొమ్మ నుంచి. టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీకి ప్రేరణ ఇదే. ఇవాళ్రేపు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి ఆపరేషన్లు చేసామని గొప్పగా చెబుతారు. గణపతి వృత్తాంతం వివరంగా మాట్లాడుకుంటే, ఆయన విషయంలో అసాధారణ, హెడ్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. అంటే గణపతి జననం.. వైద్య శాస్త్ర అద్భుతాలకు ఆనాడే బీజం వేసింది. ఇక ఆయనకు ఏనుగు తల అతికించడానికి, ఎలుకను వాహనం చేయడానికి మరో కారణం.. సర్వజీవులు సమానమన్నదానికి సూచన.
వినాయక చవితి పూజలో ఇంకా ఎన్నో విశేషాలున్నాయి. నిజానికి వినాయక చవితి ఈ సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికని చెబుతారు. వినాయకుని ప్రతిమ రూపొందించడానికి కేవలం కొత్తమట్టినే ఎంచుకోవాలని అంటారు. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి.. అని చెబుతారు. ఇలా ఎందుకు జరుగుతున్నట్టు? తరతరాలుగా గణపతి పూజా విధానం ఇలాగే ఎందుకు రూపొందించబడింది? ఇందులో కేవలం సామాజికాంశాలే కాక, మరేవైనా ఆధ్యాత్మికాంశాలు దాగి వున్నాయా? ఆయుర్వేద గుణగణాలు కలగలసి వున్నాయా? చెరువు మట్టి తెచ్చి.. విగ్రహాలు చేసి.. పత్రి పూజ చేసి.. తిరిగి ఆదిదేవుడ్ని గంగలో కలిపి.. అన్న విధానం ఆచరిచడం వెనుక రహస్యమేంటి?
పౌరాణికంగా వినాయకుడి జననం.. తర్వాతి రోజుల్లో సామాజిక అవసరంగా మారింది. కేవలం స్వాతంత్ర ఉద్యమం విషయమే కాకుండా ఇందులో మరిన్ని విశేషాంశాలు దాగి వున్నాయని చెబుతారు. ఏమిటవి? ఎలాంటివి? రుతువులకు వినాయక చవితి పండుగకు గల సంబంధమేంటి? పూజ- నిమజ్జన కార్యక్రమాల్లో ఏయే అంశాలు దాగి వున్నాయి?
పంచభూతాల్లో ఒకటైన ఈ మట్టి.. సర్వమానవాళికి అందుబాటులో వుండేది. అందుకే మట్టి విగ్రహాలు- అందునా కొత్త మట్టి విగ్రహాలు చేయమనడం మరెందుకో కాదు. సర్వమానవాళి సుఖశాంతుల కోసం. ఇదేమి లింకు? అని ప్రశ్నించుకుంటే, అందుకు అనేక సమాధానాలు తెలియవస్తాయి. వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. భూమి తల్లి కూడా అప్పుడప్పుడే వానలకు తడిసి వుంటుంది. గ్రామాలు, పట్టణాలన్న తేడా లేకుండా చెరువులు మరింత జలకళతో కనిపించాలంటే.. వాటి పూడిక తీయడం అవసరం. తద్వారా వచ్చే బంకమట్టితో వినాయక ప్రతిమలు చేయడం వల్ల.. దానికి 21 రకాల పత్రులతో నవరాత్రుల పాటూ పూజలు చేయడం వల్ల.. మరిన్ని ప్రయోజనాలున్నాయట.
21 రకాల ఆకులు సాధారణమైనవి కావు. ఔషధ శక్తి కలిగినవి. వాటితో పూజ చేయడంవల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి.. మనలో ఉండే అనారోగ్యాలను హరింపచేస్తుందని చెబుతారు. 9 రోజుల పూజ తర్వాత, నిమజ్జనం ఎందుకు చేయాలీ? అన్న సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు- వర్షాలవల్ల కలుషితం కావడం సర్వసాధారణం. ఈ నీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రి ఉపయోగపడుతుందట. 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం అందుకేనట. అలా నీటిలో కలిసిన మట్టి, రకాల పత్రి కలిసి నిమజ్జనం తర్వాత 23 గంటలయ్యాక.. తమలో ఉన్న ఔషధ గుణాల ఆల్కలాయిడ్స్ని ఆ జలంలోకి వదిలేస్తాయట. అవి బాక్టీరియా నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయని అంటారు. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం.
ఎకో ఫ్రెండ్లీ అని ఇప్పుడంటున్నారేమో కానీ, ఇదేం కొత్త నినాదం కాదు. బాగా పాతది. అందునా స్వచ్ఛమైన భారతీయత కలిగినది. వేదకాలం నుంచి పర్యావరణ పరిరక్షణ మన ఆధ్యాత్మిక విశేషాల్లో కలగలసి వుంది. అసలు మన పండగలు పబ్బాలున్నవే పర్యావరణ సమతుల్యత కాపాడ్డం కోసం. సంక్రాంతికి ముగ్గులేసి.. గొబ్బెమ్మలు పెట్టినా.. దీపావళికి మతాబులు కాల్చినా.. వాటి వెనక ఎంతో సైన్సు ఉందని చెబుతారు. ప్రస్తుత వినాయక చవితి విషయానికి వస్తే.. ఇందులో ప్రధానంగా చెప్పే పత్రి పూజ.. ఎంతో శ్రేష్టమైంది. ఈ పూజలో 21 రకాల ఆకులుంటాయి. ఆకులు ఎందుకు ఎంచుకొన్నారని ప్రశ్నించుకుంటే, మన ఋషిపరంపర ఔషధాలు, మూలికలను పూజాద్రవ్యాలుగా మార్చిన విధానం కనిపిస్తుంది. యజ్ఞ-యాగాది కార్యక్రమాల్లో సమిధలుగా కొన్ని ఆకులను, మూలికలనూ, విధిగా వినియోగిస్తారు. ఇదంతా సైన్సే.
పత్రిలో మొదటిదైన మాచీపత్రం త్రిదోషహారి. దుర్గంధాన్ని తొలగిస్తుంది. క్రిమిసంహారిణి కూడా. వినాయకుని పత్రి పూజలో మాచీపత్ర రహస్యాన్ని మొదటి నామంలోనే ఇమిడ్చారు. సుముఖాయనమః- మాచీపత్రం సమర్పయామి అన్న మాటకు అర్ధమేంటంటే.. సుముఖం అంటే చక్కటి ముఖం. పెదాలు, దంతాలు, చిగుళ్ళు, నాలుక, కంఠము, అంగిలి, నోరు- ఇలా ఏడు భాగాలు కలిగినది. అలాంటి ముఖంనుంచి వచ్చే దుర్గంధాన్ని హరించి.. సుఖాన్నిచ్చేదే మాచీ పత్రం. బృహదీ పత్రం తెలుగులో ములక అంటారు. ఈ ఆకు వంకాయ ఆకులా ఉంటుంది. తెల్లని చారలతో ఉంటుంది. దీని పండ్లు పసుపుపచ్చగా బంగారు రంగులోని ముళ్ళతో ఉంటాయి. ఇది శ్వాస, కోస వ్యాధులను నివారించే శక్తి కలిగి వుంటుంది. బిల్వపత్రంలో మూడు ఆకులు కలిసి ఉంటాయి. ఏక బిల్వం అంటే ఒకే పత్రం మూడుగా చీలి ఉంటుందన్నమాట. మూడు దళాలూ ఒకే మూలాన్నుంచి వచ్చినట్లే, సత్వ, రజ, తమో గుణాలు.. కూడా ఒకే మూలాన్నుంచి వస్తాయని సూచిస్తుంది. త్రిమూర్తులు ఒక్కటే గమనించమంటుంది. ఇక దీని ఆధ్యాత్మిక గుణాల గురించి ప్రస్తావిస్తే.. ఈ బిల్వం మధుమేహం వ్యాధినివారణలో ఔషధంగా వాడతారు. రక్తాన్ని శుద్ధిచేస్తుంది. దీని పండ్లు బంగారు రంగులో వుంటాయి. లోపలి గుజ్జు మంచి వాసనలు వెదజల్లుతుంది. అందులో బంగారు రంగులో తేనెలాంటి ద్రవం ఉంటుంది. ఈ గుజ్జు రక్తశుద్ధికీ, మలబద్ధకం తొలగించడానికీ వాడతారు. ఇక గరిక లేదా గడ్డి. ఈ గడ్డి మూడు రకాలు. ఇవి దాహం, చర్మ రోగం, చుండ్రు- నివారణకు వాడుతారు. చెడ్డ కలలు వచ్చినపుడు మూత్ర విసర్జనలాటి సమస్యలను గరిక నివారిస్తుందని అంటారు.
ఉమ్మెత్త- జ్వరం, కుష్టు, విషప్రభావం తగ్గించడానికి..
బదరీ అంటే రేగు చెట్టు ఆకు- జీర్ణశక్తికి, బొజ్జ తగ్గడానికి..
ఉత్తరేణి- అతి ఆకలి, కడుపు నొప్పి, శ్వాస వ్యాధుల నివారణకు..
తులసి- చర్మవ్యాధినిర్మూలనకు..
మామిడి- అతిమూత్ర, గుండెల్లో మంట, వాంతులు, అతిసారం నిర్మూలనకు..
గన్నేరు- మొండి పుండ్లు, వాపులు, తేలు కాటుకు..
విష్ణుక్రాంత- మూత్ర దోషాలు, కుష్టు వ్యాధి నివారణకు..
దానిమ్మ- వాంతులు, జలుబు తగ్గించుటకు
దేవదారు- కీళ్లనొప్పుల నుంచి విముక్తికి..
మరువక- దుర్గంధం, పురుగులను తొలగించడానికి..
వావిలి- తలనొప్పి, చెవిపోటుకు..
గండలీ- జర్వం, దాహం తగ్గించడానికి..
జమ్మి- త్రిదోష వ్యాధుల నివారణకు..
రావి- స్త్రీ సంబంధ వ్యాధులకు..
మద్ది- రక్తదోషం, టీబీ, గుండె రోగాలకు..
జిల్లేడు- పాము కాటు, శ్వాస కోశ వ్యాధుల విరుగుడుగా.. పనికి వస్తాయి. ఇవన్నీ నవరాత్రులయ్యాక వినాయక విగ్రహాలతో కలగలసి ఆయా చెరువులూ కుంటల్లో కలుస్తాయి. వీటి ద్వారా ఆ నీళ్లకు విశేష ఔషధ గుణాలు తోడవుతాయి. ఆ నీటికి మినరల్ పవర్ కలుస్తుంది. అందుకే వినాయక నిమజ్జనం సర్వమానవాళి సౌభ్రాతృత్వానికి ప్రతీక. సర్వేజనా సుఖినోభవంతుకు నిలువెత్తు నిదర్శనంగా భావిస్తారు.
ఇప్పటి వినాయక నిమజ్జనం పర్యావరణ ప్రహసనంగా తయారైంది. నిమజ్జనం తర్వాత ఔషధ గుణాలతో అలరారాల్సిన చెరువులు విషతుల్యమైపోతున్నాయి. ఇందుకు మారిన కాలమే కారణమా? మట్టి వినాయకుడు- ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కళకళలాడ్డమే ఇందుకు మెయిన్ రీజన్ అంటున్నారు
Share on Google Plus

About Bakthi Today

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment