వేములవాడ రాజరాజేశ్వర స్వామి

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjdK-1qMuCmj4jWYXNyhL4Gr0S6aKBSr5ZF1fZH59Sw6TkvmWXrSEKtJoH0Lu_W1XP88aZgXqfVeG7lvtHc78ptv4Sro_THT-oxraS85Pbd2pI30RIdCTdNKbeEgF9mZxc-TBis7tYd5Ws/s1600/20moon.jpg
ప్రాంతం - కరీం నగర్ జిల్లా లోని వేములవాడ
దైవం - రాజ రాజేశ్వర స్వామి
ఆలయం నిర్మించిన కాలం - క్రీ.శ. ఎనిమిదో శతాబ్దం 
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలో రాజరాజేశ్వరీదేవి సమేతుడై లింగరూపంలో వెలసిన రాజరాజేశ్వరస్వామి పూజలందుకుంటున్నాడు.
వేములవాడను శివరాత్రి రోజున ఐదు లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా.
స్ధలపురాణం -
     లేంబాల వాటికగా, భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యత్తోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక రుషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.
ప్రత్యేకతలు
వేములవాడ గుడి ఆధ్వర్యంలో 1956 నుంచి వేములవాడ, కరీంనగర్‌, ధర్మపురిలలో సంస్కృత విద్యాసంస్థల నిర్వహణ జరుగుతున్నది. వేములవాడలో డిగ్రీస్థాయి వరకు సంస్కృత భాష బోధించబడుతున్నది.
11వ శతాబ్ది తెలుగు కవి వేములవాడ భీమకవి, కన్నడ ఆదికవి పంపన వేములవాడ వాస్తవ్యులే!!
శివరాత్రి రోజున వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రివేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.
ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు . భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, ఆ గిత్తను దేవాలయానికిదక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.
శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.
దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ళ నాటి మసీదు ఉన్నది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్లో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారట.
     పురాతత్వ ఆధారాలను బట్టి వేములవాడ పశ్చిమ చాళుక్యుల రాజధాని అని తెలుస్తున్నది. క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో నిర్మించబడ్డ ఈ ఆలయానికి ఆనాటి వేములవాడ చాళుక్యరాజు మొదటి నరసింహుడికి గల “రాజాదిత్య” అనే బిరుదు నుంచి రాజరాజేశ్వరాలయం అనే పేరు వచ్చిందని భావిస్తున్నారు.
     చారిత్రాత్మకంగా వేములవాడ క్షేత్రం అతిసనాతనమైనదని, చాళుక్యుల కాలంలో ఈ క్షేత్రం మహిమాన్వితంగా వెలుగొందినట్లు పరిశోధకుల అంచనా. క్రీ.శ. 750 నుంచి 973 వరకు సుమారు 220 సంవత్సరాలు వేములవాడ చుట్టుపక్కల ఆలయాల నిర్మాణం సాగినట్లు తెలుస్తున్నది.
వేములవాడలోని మరికొన్ని ఆలయాలు -
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం కాక వేములవాడలో సీతారామచంద్రస్వామి, అనంతపద్మనాభస్వామి, త్రిపురసుందరి, కేదారేశ్వర, భీమేశ్వరస్వామి, వడ్డెగేశ్వరస్వామి ఆలయాలున్నాయి. గండదీపం, ఉత్సవ మూర్తుల అద్దాల మహలు, నాగిరెడ్డి మండపం ప్రధానాలయానికి అనుబంధంగా వున్నాయి.
వేములవాడ కరీంనగర్‌కు 36 కిమీల దూరంలో కరీంనగర్‌ - కామారెడ్డి దారిలో ఉంటుంది.  కరీంనగర్ నుంచీ ఎక్స్ ప్రెస్ బస్సులు చాలా నడుస్తుంటాయి.


Share on Google Plus

About Bakthi Today

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment